కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)లను అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి’ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నగర శివారు ప్రాంతాల స్వరూపాన్నే మార్చేస్తుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
రావిర్యాల్ ఓఆర్‌ఆర్ ఇంటర్‌ఛేంజ్ నుంచి ఆమన్‌గల్ వరకు మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవునా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 4,621 కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఒప్పందం ప్రకారం, నిర్మాణ పనులను 30 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల్లోని 14 గ్రామాల గుండా ఈ రహదారి ప్రయాణించనుంది.
ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారి కేవలం రవాణా సౌకర్యాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ‘ఫ్యూచర్ సిటీ’కి ఒక ప్రత్యేక కారిడార్‌గా నిలవనుంది. దీనివల్ల ఈ-సిటీకి మెరుగైన అనుసంధానం ఏర్పడి, ఐటీ పార్కులు, పరిశోధన కేంద్రాలు, ఆధునిక నివాస సముదాయాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ తెలంగాణ’ కార్యక్రమానికి కూడా ఇది ఊతమిస్తుందని అంచనా వేస్తున్నారు.
100 మీటర్ల వెడల్పుతో కంట్రోల్డ్ యాక్సెస్ ఎక్స్‌ప్రెస్‌వేగా దీనిని తీర్చిదిద్దనున్నారు. తొలుత ఇరువైపులా మూడు లేన్లతో (3+3) నిర్మించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎనిమిది లేన్ల (4+4) వరకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ రహదారి మార్గంలో 8.94 కిలోమీటర్ల భాగం ఏడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌ల మీదుగా వెళ్లనుండగా, అవసరమైన అటవీ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏ ఇప్పటికే దరఖాస్తు చేసింది.
ఈ భారీ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనున్నారు. తొలి దశలో రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 19.20 కిలోమీటర్ల రహదారిని రూ. 1,911 కోట్లతో నిర్మిస్తారు. రెండో దశలో మీర్‌ఖాన్‌పేట నుంచి ఆమన్‌గల్ వరకు 22.30 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 2,710 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాలకు మహర్దశ పట్టడంతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.


