రంగేసి.. చిందేసి..
* అంబరాన్నంటిన హోలీ సంబురాలు
* రంగుల్లో మునిగితేలిన
కాకతీయ,చేర్యాల: చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే యువతీ యువకులు, విద్యార్థులు రంగుల పొట్లాలతో వీధుల్లో సంచరిస్తూ ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ రంగునీళ్లు చల్లు కుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా గంతులు వేశారు. హోలీ.. హోలీల రంగ హోలీ.. అంటూ చిందులు కూడా వేశారు. చేర్యాల పట్టణంలోని గల్లీలు రంగుల మాయంగా మారాయి. రకరకాల రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ ఘనంగా జరిపారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సంతోషకరమైన వాతావరణంలో రంగులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. చిన్న పిల్లలు రంగు తుపాకీలతో తమ తోటి వారిపై రంగు నీళ్ళను పిచికారీ చేస్తూ కేరింతలు వేశారు. స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ బృందంగా తిరుగుతూ హోలీ రంగుల్లో తడిసి ముద్దయ్యారు. గల్లీ గల్లీలో రంగులు పులుముకుని, పిల్లలు ఆనంద ఉత్సవంగా జరుపుకున్నారు.
చేర్యాల పట్టణ ఆర్యవైశ్య మహసభ ఆధ్వర్యంలో
చేర్యాల పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో హోలీ పండుగను పురస్కరించుకుని ప్రజలందరికి పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నంలో కృత్రిమ మామూలు రంగులను ఒకరు ఒకరు చల్లుకుని హోలీ పండుగను వైభవంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా కలిసి ఆడిపాడుతూ రంగులు పూసుకుంటూ జాతీయ రహదారిమీదుగా సందడి చేశారు.పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకుంటూ డ్యాన్స్ చేశారు.


