శ్రీరామ్ హిల్స్‌లో ఘనంగా రంజాన్
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో రంజాన్ పండుగ సందడిగా కొనసాగింది. పవిత్ర రంజాన్ సందర్భంగా శ్రీరామ్ హిల్స్‌లోని డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ ముక్తార్ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ పునుకొల్లు నీరజ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ తుమ్మల యుగేందర్ ప్రత్యేకంగా హాజరై డిప్యూటీ మేయర్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఆత్మీయంగా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మేయర్ నీరజ మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందించే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి, కార్పొరేటర్లు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


