- రాంలీలా కార్యక్రమాన్ని అడ్డుకోవడం సమంజసం కాదు
- నిరసన తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లా కేంద్రంలోని రాంనగర్ మార్క్‌ఫెడ్ మైదానంలో దసరా రోజు నిర్వహించే రాంలీలా కార్యక్రమాన్ని ఈ ఏడాది నిర్వహించకుండా, మైదానం గేటుకు తాళం వేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు నిరసించారు. బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మార్క్‌ఫెడ్ మైదానం గేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.
హరి శంకర్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయాన్ని అవమానించడం సరికాదన్నారు. రాంలీలా కార్యక్రమాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఆరోపించారు. వెంటనే మైదానం గేటును తాళం తీసి, రాంలీలా నిర్వహణకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాంలీలా కార్యక్రమం సంవత్సరాలుగా ఆచారం ప్రకారం జరుగుతుందని, ఆపివేయడాన్ని ప్రజల భావాలకు విరుద్ధమని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని కార్యక్రమం నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.


