మల్లంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి చీదర సంతోష్‌కు మద్దతుగా రమాదేవి ప్రచారం
కాకతీయ, ములుగు ప్రతినిధి : గురువారం జేడీ మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్ తరఫున దివంగత నేత, మాజీ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ సతీమణి కుసుమ రమాదేవి ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించిన రమాదేవి, బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ గెలుపు కోసం ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడారు. ప్రచార సభలో రమాదేవి మాట్లాడుతూ మల్లంపల్లి అభివృద్ధికి సంతోష్ అంకితభావంతో కృషి చేస్తాడు అని తెలిపారు. మల్లంపల్లి మండల సాధనలో సంతోష్ పాత్ర కీలకమైంది అని, గ్రామాభివృద్ధికి అవసరమైన పనులన్నింటినీ అతడు బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతాడు అని అన్నారు. మండలం ఇచ్చిన బీఆర్ఎస్కు పట్టం కట్టాలంటే ప్రజలు మరోసారి సంతోష్‌కు ఆశీర్వాదం ఇవ్వాలి అని పిలుపునిచ్చారు.
గ్రామంలో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యలన్నిటినీ సంతోష్ స్థానికుడిగా ఉండి మరింత వేగంగా పరిష్కరించగలడని పేర్కొన్నారు. రమాదేవి సందర్శనతో మల్లంపల్లి గ్రామంలో ప్రచారం పరుగులు పెరిగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరి సంతోష్ తరఫున ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించారు. అభిమానులు, కార్యకర్తలు సంతోష్ చుట్టూ గుమిగూడి తమ అభ్యర్థిని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.గ్రామం అభివృద్ధి దిశగా సంతోష్ విజయం కీలకమని బీఆర్ఎస్ స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.


