రంజాన్ సోదరభావానికి ప్రతీక
భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతి
రంజాన్ ప్రేత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కూనంనేని
కాకతీయ, కొత్తగూడెం : రంజాన్ పర్వదినం క్రమశిక్షణకు, సోదరభావానికి ప్రతీక అని, ఈ పండుగ సమాజంలో శాంతిని వెల్లివిరియజేస్తుందని, రంజాన్ కేవలం ముస్లిం సోదరుల పండుగే కాకుండా సమస్త మానవాళికి ఒక సందేశమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం నియోజకవర్గ పరిధిలోని పలు మసీదులు, ఈద్గాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన, వారికి హృదయపూర్వక ఈద్ ముబారక్ తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపడం గొప్ప విషయమన్నారు. రంజాన్ మాసం నేర్పిన త్యాగ నిరతి, దాతృత్వం ఏడాది పొడవునా కొనసాగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని మసీదులు, ఈద్గాలు అదేవిధంగా ఖబ్రస్తాన్ల అభివృద్ధిపై తనకు ప్రత్యేక దృష్టి ఉందని, వాటి పునర్నిర్మాణానికి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ప్రభుత్వ పరంగా అందాల్సిన ఫలాలను ప్రతి పేదవాడికి చేరేలా చూస్తానని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలో అన్ని మతాల వారు సోదరభావంతో కలిసి ఉండాలని కోరారు. కూనంనేని వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాధం, పూర్ణచందర్ రావు, సాయిబాబా, యు రాహుల్, మైనార్టీ నాయకులు నయీమ్ ఖురేషి, అబీద్ హుస్సేన్, ఉమర్ ఫరూక్, జహంగీర్, అమీర్ ఖాద్రి, అబ్దుల్ కరీమ్, జుబేర్, జావేద్, కార్పొరేటర్లు ఏ సాయిబాబా, విశ్వేశ్వర్ రావు, బోయిన విజయ్ కుమార్, బండి నర్సింహా, జి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.


