కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. వ్యవసాయ వర్సిటీ సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ లభ్యం అయ్యింది. అటుగా వెళ్తున్న స్థానికులు రక్తపు మడుగులో ఉన్న శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రాథమిక విచారణలో, మృతదేహంపై గొంతుకు కత్తితో గాయాలు ఉన్నాయని, హత్య అత్యంత క్రూరమైన రీతిలో జరిగిందని గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.
క్లూస్ టీం సహాయంతో ప్రత్యేక ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య ఎక్కడో వేరే చోట జరిగింది అని, తర్వాత శవాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడేశారని వారు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు గురైన వ్యక్తి ఎవరు, హత్యకు కారణం ఏమిటి, శవాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన కారణం ఏంటి అన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా నగరంలో వరుస హత్యలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొన్ని రోజుల క్రితం మహిళల మృతదేహాలు కనుగొన్న సంఘటనలతో నగరంలో కలకలం రేగుతోంది. పోలీసులు ఈ తాజా ఘటనను కూడా ఇతర హత్యలతో సంబంధించవచ్చేమో అని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సాక్ష్యాలను సేకరించి, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, హత్య వెనుక ఉన్న నిదర్శనాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.


