ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
కాకతీయ, సినిమా: ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారితీశాయి. హైదరాబాద్‌లో జరిగిన కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దివంగత నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే సందర్భంలో తమిళనాడుకు చెందిన దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురవుతున్నాయి.
కాంతారావు గారి జానపద చిత్రాలను చూసి ఎంజీఆర్ భయపడి ‘ఉచ్చ పోసుకునేవాడు’ అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఆ కాలంలో కాంతారావు నటనను చూసి ఎంజీఆర్ వణికిపోయేవాడని, ఎవడ్రా వీడు ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు అని భయపడేవాడంటూ రాజేంద్ర ప్రసాద్ అగౌరవంగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప నటుడిని పొగిడే క్రమంలో మరో దిగ్గజాన్ని అవమానించడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సినీ వర్గాల్లోనూ చర్చ కొనసాగుతోంది.


