- రైలులో కోటి విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం
- ఒకరిని అరెస్టు చేసిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైలులో రూ.కోటి విలువ చేసే డ్రగ్స్ ను తరలిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ చిత్తోర్ ఘడ్ కు చెందిన లోకేష్ భరత్ సదవ తరగతి వరకు చదివాడు. షార్ట్ టర్మ్ హోటల్ మేనేజ్ మెంట్ కోర్టు లు చేసి రాజస్థాన్ లోని పలు హోటల్ లలో పని చేశాడు. అయితే మేనేజ్ మెంట్ మారడంతో లోకేష్ ఉద్యోగం పోయింది. దీంతో ఖాళీగా ఉన్న సమయంలో అతనికి జగదీష్ గుజ్జర్ పరిచయం అయ్యాడు. ఈ సందర్భంలో హైదరాబాద్ , చెన్నై తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేసి డబ్బులు సంపాదిద్దామని స్కెచ్ వేశాడు.
ఈ నేపధ్యంలోనే జగదీష్ గుజ్జర్ అగస్టు నెలలో 2 కేజీల ఓపియం డ్రగ్స్ ను కాచిగూడ రైల్వే స్టేషన్ లో డెలివరి చేసి వెళ్ళిపోయాడు. తాజాగా జగదీష్ గుజ్జర్ ఆదేశాల మేరకు లోకేష్ 7 కేజీల ఓపియం ను ఈ నెల 7వ తేదిన రాజస్థాన్ నుంచి రైలులో తీసుకుని బయలుదేరాడు. శుక్రవారం ఉదయం కుందన్ పల్లి ఓఆర్ఆర్ రొటరీ వద్ద దిగి డెలివరీకి సిద్ధమవుతుండగా సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్ పెక్టర్ జానయ్య టీం, కీసర పోలీసులు సంయుక్తంగా లోకేష్ ను అదుపులోకి తీసుకుని అతని వద్దల కోటి రూపాయాలు విలువ చేసే ఏడు కేజీల ఓపియం, 2 కేజీల పాపి స్ట్రాలను స్వాధీనం చేసుకున్నారు. జగదీష్ గుజ్జర్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.


