రాజమౌళికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి
ప్రభుత్వాన్ని కోరిన మాజీమంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే చల్లా
గంగదేవిపల్లిలో నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ
కాకతీయ, గీసుగొండ : జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమౌళి మృతి విషయం తెలుసుకున్న వారు గంగదేవిపల్లికి చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పల్లెటూరిని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా తీర్చిదిద్దడం సాధారణ విషయం కాదన్నారు. గ్రామ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు కూసం రాజమౌళి అని కొనియాడారు. గంగదేవిపల్లి అభివృద్ధిని దేశ ప్రధాని కూడా తన మన్ కీ బాత్ కార్యక్రమంలో పలుమార్లు ప్రస్తావించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజమౌళి సేవలను గుర్తించి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని గంగదేవిపల్లిలో ప్రారంభించి 10 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి సేవలు చేసిన నాయకుడికి ప్రభుత్వం గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


