- భయం గుప్పిట్లో నగరం
- ‘మొంథా’ పోయినా దంచి కొడుతున్న వానలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరాన్ని వానలు వదలడం లేదు. మంగళవారం ఉదయం సూర్యోదయం మొదలు వర్షం దంచి కొట్టింది. అకాల వర్షాల కారణంగా ఏనుమాముల మార్కెట్లో రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన పత్తి మొత్తం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి అమ్ముదామని మార్కెట్ కు తీసుకువస్తే అకాల వర్షం వల్ల భారీగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి తడిసిన పత్తిని కొనేలా చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. మొంథా తుఫాన్ గత వారమే వరంగల్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇప్పుడిప్పుడే కాలనీలన్నీ ముంపు నుంచి తేరుకుంటున్నాయి. వరద కారణంగా నగరంలోని దాదాపు 110 కాలనీలు జలమయం అయ్యాయి. దాదాపు 6,465 ఇళ్లకు పాకిక్షంగా నష్టం వాటిల్లిందని సర్వే అధికారులు తెలిపారు. తాజా వర్షంతో మరోసారి వరంగల్ నగరం ముంపునకు గురవుతుందా అనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని మళ్లీ ముంపునకు గురి కాకుండా లోతట్టు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.


