కాకతీయ, తెలంగాణ బ్యూరో: బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఓట్ల చోరీపై సంచలన సమాచారాన్ని త్వరలో బయటపెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. ఇది సాధారణ ఆరోపణ కాదని, “ఆటమ్ బాంబు కంటే హైడ్రోజన్ బాంబు శక్తివంతమైనదే” అన్న పోలికతో తన మాటలకు మరింత బలం చేకూర్చారు. ఆ వివరాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపలేరని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఓటర్ అధికార్ యాత్ర బిహార్‌లో పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందింది. ససారంలో ఆరంభమైన ఈ యాత్ర, 16 రోజులు పాటు 25 జిల్లాలు, 110 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,300 కిలోమీటర్ల మేర కొనసాగింది. చివరగా పట్నాలో ముగిసిన ఈ యాత్రలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ, “బిహార్ విప్లవ రాష్ట్రం. ఇక్కడి ప్రజలు ఓట్ల దొంగతనాన్ని తట్టుకోలేరని స్పష్టమైన సందేశం ఇచ్చారు” అని అన్నారు.
మహాగఠ్‌బంధన్‌కు చెందిన నేతలు కూడా ఈ సభలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, “బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ కలిసి నితీశ్‌కుమార్‌ను వాడేసి పడేయబోతున్నాయి” అని అన్నారు. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా నితీశ్ పాలనపై విరుచుకుపడి, ఆయన అవినీతిలో ‘భీష్మపితామహుడు’గా మారిపోయారని ఎద్దేవా చేశారు.
మరోవైపు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, “రాహుల్ దేశ ఓటర్లను అవమానపరుస్తున్నారు. బీజేపీ విజయాలను మోసం, ఓట్ల చోరీతో అనుసంధానించడం బాధ్యతారహితమైన చర్య” అని అన్నారు. అంతేకాకుండా, “ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత హోదాను దిగజారుస్తున్నాయి. అణు బాంబు, హైడ్రోజన్ బాంబు లాంటి పోలికలకు ఎన్నికలతో ఎలాంటి సంబంధం?” అని ప్రశ్నించారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బిహార్ ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి. ఒకవైపు కాంగ్రెస్, మహాగఠ్‌బంధన్ నేతలు బీజేపీపై ప్రజాస్వామ్యం కాపాడే పేరుతో దాడి చేస్తుండగా, మరోవైపు బీజేపీ దీనిని ఓటర్లపై అవమానకరమైన వ్యాఖ్యగా అభివర్ణిస్తోంది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన “హైడ్రోజన్ బాంబు” వివరాలు నిజంగానే వెలుగులోకి వస్తాయా అన్నది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.


