‘రెహమాన్ ద్వేషంతో ఉన్నారు’
ఆస్కార్ అవార్డు గ్రహీతపై కంగనా సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, సినిమా డెస్క్ : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై చేసిన ‘మతపరమైన’ వ్యాఖ్యలపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “మీ అంత పక్షపాతం, ద్వేషం నిండిన వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు” అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెహమాన్‌పై నిప్పులు చెరిగారు. తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను ప్రాపగండా చిత్రమంటూ రెహమాన్ అవమానించారని, కనీసం కథ వినడానికి కూడా నిరాకరించారని కంగనా ఆరోపించారు. “ప్రియమైన ఏఆర్ రెహమాన్, నేను ఒక కాషాయ పార్టీకి (బీజేపీ) మద్దతు ఇస్తున్నందుకు ఈ సినీ పరిశ్రమలో ఎంతో వివక్షను, పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నాను. కానీ, మీలో ఉన్నంత పక్షపాతం, ద్వేషం ఉన్న వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదని కచ్చితంగా చెప్పగలను. నేను నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమా కథను మీకు వినిపించాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ మీరు కథ వినడం దేవుడెరుగు, కనీసం నన్ను కలవడానికి కూడా నిరాకరించారు. నేను కేవలం ప్రాపగండా (ప్రచార) సినిమాలు మాత్రమే తీస్తానని, అందుకే మీరు నా సినిమాలో భాగం కాకూడదని అనుకున్నట్లు నాకు తెలిసింది” అని కంగనా పేర్కొన్నారు.


