ర్యాగింగ్ చేశారంటే క్రిమినల్ కేసులే
విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు
యాంటీ ర్యాగింగ్ కమిటీల ఏర్పాటు
విస్తృతంగా అవగాహన కల్పించాలి
24 గంటలు హెల్ప్‌లైన్ నంబర్లు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : విద్యాసంస్థల్లో ర్యాగింగ్ వంటి వికృత చేష్టలకు పాల్పడితే విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ర్యాగింగ్‌ను ఏ మాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ర్యాగింగ్ నియంత్రణపై కమిషనర్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థులు కేవలం విద్యాసంస్థల నుంచే కాకుండా, భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాల నుంచి దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సీనియర్ విద్యార్థుల ముసుగులో జూనియర్లను వేధించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే విద్యాసంస్థల యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్వ్కాడ్‌లు ఏర్పాటు చేయాలని, కొత్తగా వచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ర్యాగింగ్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాపులు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి వేధింపులు, దౌర్జన్యాలు ఎదుర్కొంటే వెంటనే ప్రిన్సిపాల్, యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం అందించాలి. 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని విద్యాసంస్థల యాజమాన్యానికి సూచించాం అని కమిషనర్ తెలిపారు. ర్యాగింగ్ అనేది కేవలం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి పనిచేస్తేనే ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలము అని సన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.


