జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ కలకలం..
ఇద్దరు మగ విద్యార్దులకు వివాహ వేడుక జరిపిన సీనియర్ విద్యార్దులు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఉన్నతాదికారులు నేరుగా జోక్యం చేసుకోవాలని విద్యార్ది సంఘాల డిమాండ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా కోడిమాల మండలం సమీపంలోని నాచుపల్లి జెఎన్టీయూ క్యాంపస్లో సీనియర్ విద్యార్దులు జూనియర్ విద్యార్దులను ర్యాగింగ్ చేసిన ఘటన సంచలనంగా మారింది. సీనియర్లు జూనియర్ల పై విచక్షణ రహితంగా దుర్వినియోగం చేసిన వీడియోలు బయటకు రావడంతో విద్యార్థి వర్గాల్లో కలకలం రేగింది. కాలేజీకి విద్యాబోధన కంటే ర్యాగింగ్ అసభ్య వినోదాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోందనే అభిప్రాయం బలపడుతోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించినా నెట్టింట వీడియోలు వైరల్ కావడంతో అసలు పరిస్థితి బయటపడింది. వీడియోల్లో మగ విద్యార్థులిద్దరికీ వివాహం నిర్వహిస్తున్న దృశ్యాలు స్పష్టంగా వెలికి చూశాయి.

మాంగళ్యం ధరింపజేయడం, అరుంధతి చూపించడం, వివాహానంతర ఆచారాల వరకు సీనియర్లు ర్యాగింగ్‌ను అసహజంగా మార్చిన తీరు ఆగ్రహానికి దారి తీస్తోంది. కొందరిని చున్నీ కట్టించి డ్యాన్సులు చేయించడం బలవంతంగా అవమానకర పరిస్థితుల్లోకి నెట్టడం వంటి సన్నివేశాలు విద్యార్థుల భద్రతపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. సంఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా కాలేజీ యాజమాన్యం కానీ పోలీసులు కానీ స్పందించకపోవడం మరింత అనుమానాస్పదంగా మారింది. క్యాంపస్‌లో పర్యవేక్షణ పూర్తిగా కనుమరిగైయిందని యాజామాన్యం ఎందుకు మౌనంగా ఉందన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి.

ఇటీవలి కాలంలో సెక్యూరిటీ చీఫ్ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనపై నిరసనలు చోటుచేసుకున్న నేపథ్యంలో క్యాంపస్‌లో శాంతి భద్రత పూర్తిగా విఘాతం చెందిందని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. పరిపాలన వ్యవస్థ బలహీనత నియంత్రణలో వైఫల్యమే ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తోందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. బాధ్యులైన సీనియర్లు, అధికారులు, నిర్వాహకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ర్యాగింగ్ పై కఠినమైన నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కొండగట్టు జెఎన్టీయూ పరిస్థితిపై ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలనే డిమాండ్ తీవ్రంగా వినిపిస్తోంది.



