ఆర్టీఏలో రేడియం స్టిక్కర్ రగడ
ఫిట్నెస్ టెస్టులో వాహనదారులపై ఫీజుల భారం
అదనుగా దోపిడీ మొదలు పెట్టిన ఏజెన్సీలు
స్టిక్కర్ లేకపోతే ‘అన్‌ఫిట్’ ముద్ర
క్యూఆర్ కోడ్ పేరుతో కొత్త బాదుడు
పాత స్టిక్కర్ ఉన్నా మళ్లీ తప్పనిసరంటా..!
కాకతీయ, ఖమ్మం : రవాణా శాఖలో రేడియం స్టిక్కర్ అమలు పేరుతో కొత్త రగడ మొదలైంది. రోడ్డు భద్రత పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం, ఇప్పుడు వాహనదారులకు భారంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ స్టిక్కరింగ్‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటే తప్పనిసరిగా ఈ స్టిక్కర్ వేయించుకోవాలని నిబంధన పెట్టడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. రవాణా కార్యాలయాలకు వచ్చే ప్రతి వాహనానికి ముందుగా కొలతలు తీస్తున్నారు. ఆ తర్వాత స్టిక్కర్ వేస్తున్నారు. ఫోటోలు తీస్తున్నారు. ఫీజు చెల్లింపులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయ్యాకే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అవుతోంది. లేదంటే వాహనం ‘అన్‌ఫిట్’గా మిగిలిపోతుంది.

ఫిట్నెస్ కోసం స్టిక్కర్ తప్పనిసరి
మీటరుకు రూ.150 చొప్పున స్టిక్కర్ ఛార్జ్ విధిస్తున్నారు. వాహనం పరిమాణం ఎంత ఉంటే అంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. చిన్న వాహనానికి రూ.2 వేల వరకు ఖర్చవుతుండగా, పెద్ద వాహనాలకు రూ.7 వేల వరకు బిల్లు పడుతోంది. ఇటీవల ఖమ్మం రవాణా కార్యాలయానికి వచ్చిన ఆర్టీసీ బస్సులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే స్టిక్కర్ ఉన్నప్పటికీ, మళ్లీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఏజెన్సీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రూ.7 వేల వరకు ఫీజు చెప్పడంతో బస్సులు వెనుదిరిగాయి. ఈ కొత్త విధానం వాహనదారులపై అదనపు ఆర్థిక భారంగా మారింది. గతంలో పూర్తి స్టిక్కరింగ్‌కు రూ.1000లోపే ఖర్చు అయ్యేది. ఇప్పుడు అదే పని కోసం పలుమార్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. అవగాహన లేకుండా కార్యాలయాలకు వెళ్లిన వాహనదారులు అక్కడే షాక్‌కు గురవుతున్నారు. చేతిలో డబ్బులు లేకపోతే ఫిట్నెస్ లేకుండానే వాహనాలను రోడ్డు మీదకు తీసుకువెళ్తున్నారు. ఇది మరో సమస్యకు దారి తీస్తోంది. ఇంకో వైపు ఈ పాలసీ వల్ల స్థానిక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సంవత్సరాలుగా రవాణా కార్యాలయాల వద్ద స్టిక్కరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వారు ఒక్కసారిగా నిరుద్యోగులయ్యారు. ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించడంతో చిన్న కార్మికుల జీవనోపాధి దెబ్బతింది. రోడ్డు భద్రత కోసం తీసుకొచ్చిన విధానం, అమలులో మాత్రం వాహనదారులకు భారంగా మారింది. ఏజెన్సీల ఆధిపత్యం, అధిక ఫీజులు, అవగాహన లోపం కలిసివచ్చి సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధానంపై సమీక్ష చేసి, వాహనదారులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.


