రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు
సింగరేణిపై కల్పిత కట్టు కథనాలు
నా వ్యక్తిత్వ హననం చేసేలా ఆయన రాతలు
సైట్ విజిట్ నిబంధన కొత్తది కాదు.. దేశవ్యాప్తంగా అమలులో ఉన్నదే
డీజిల్ సరఫరాలో కుంబకోణమంటూ నిరాధార ఆరోపణలు
2014 నుంచి జరిగిన అన్ని టెండర్లపై విచారణకు సిద్ధం
సింగరేణిలో కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది బీఆర్ ఎస్‌కు చెందినవారే
సింగరేణి ప్రజల ఆస్తి.. స్వయంప్రతిపత్తితో పనిచేస్తోంది
సింగరేణిపై గద్దలు–రాబందులను వాలనివ్వను
కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది
ఆంధ్రజ్యోతి కథనాలపై మరోసారి ధ్వజమెత్తిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కాకతీయ, తెలంగాణ బ్యూరో : “రాధాకృష్ణ… నువ్వు రాసింది అవాస్తవమని ఒప్పుకో. లేదంటే అది నా వ్యక్తిత్వ హననంగానే భావించాల్సి వస్తుంది” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర హెచ్చరిక చేశారు. సింగరేణి సంస్థపై, తనపై వస్తున్న కథనాలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని, పెట్టుబడులు–కట్టు కథలతో విషపు రాతలు రాయడం ద్వారా సంస్థకూ, కార్మికులకూ నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో జ్యోతిరావు పూలే భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న తప్పుడు కథనాలు తనను తీవ్రంగా ఆవేదనకు గురిచేశాయన్నారు. సింగరేణిలో జరిగే టెండర్లు, కాంట్రాక్టులు, వాటికి సంబంధించిన ఫైళ్లు తన వద్దకు గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ రావని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ సంస్థకు ప్రత్యేక బోర్డు ఉందని, సీనియర్ అధికారులు స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. సంస్థలో అమలులో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే అన్ని నిర్ణయాలు జరుగుతాయని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదన్నారు.
సైట్ విజిట్ నిబంధనపై తప్పుడు ప్రచారం
నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలన్న నిబంధనను తామే కొత్తగా పెట్టినట్లు రాధాకృష్ణ రాయడం పూర్తిగా అవాస్తవమని భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ నిబంధన కేవలం సింగరేణిలో మాత్రమే లేదని, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఆయిల్ కంపెనీలు సహా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏళ్లుగా అమలులో ఉందన్నారు. 2018 నుంచే సింగరేణిలో ఈ విధానం కొనసాగుతోందని, సీఎంపీడీఐఎల్ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్లలో ఇదే స్పష్టంగా ఉందని రుజువులతో వివరించారు. సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా కుంభకోణం జరిగిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విధానం 2022లోనే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అమలులోకి వచ్చిందని, జీఎస్టీ మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్టుల్లో ఇదే విధానం అమలులో ఉందని గుర్తుచేశారు.
సుజన్ రెడ్డి కంపెనీపై కట్టు కథలు
సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి బావమరిదికి కట్టబెడుతున్నారన్న ప్రచారం పూర్తిగా కట్టుకథేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దీప్తి రెడ్డి అని, ఆమె మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుమార్తె అని చెప్పారు. ఆమె భర్తే సుజన్ రెడ్డి అని వివరించారు. అలాగే సింగరేణి సంస్థలో ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉన్న ఐదుగురు కూడా టీఆర్‌ఎస్‌కు సంబంధించిన వారేనని తెలిపారు. హరీశ్ రావు లేఖ రాస్తే, నైనీ బ్లాక్ టెండర్‌తో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టులపై విచారణకు సిద్ధంగా ఉన్నామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి రాగానే స్వయంగా ఆయనను ఒప్పించి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తానన్నారు. అప్పుడు వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని చెప్పారు.
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి
“నేను రాజకీయాల్లోకి వచ్చినది ఆస్తులు దోచుకోవడానికి కాదు. ప్రజల ఆస్తులను కాపాడటానికే వచ్చాను” అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్నానని, సింగరేణి కార్మికుల రక్తం–చెమటతో ఏర్పడిన ఈ సంస్థపై గద్దలు, రాబందులు, పెద్దలను వాలనివ్వనని తేల్చిచెప్పారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణ తన రాతలు అవాస్తవమని స్వయంగా తిరిగి రాయకపోతే, వాటిని వ్యక్తిత్వ హననంగా భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.


