పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
రూ.60 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్లకు భూమిపూజ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్పష్టం చేశారు. నాణ్యతలో ఎలాంటి రాజీకి తావు లేదని, ప్రజల డబ్బుతో చేపట్టే పనులు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలన్నారు. మంగళవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి 1వ, 20వ డివిజన్ల పరిధిలోని ఆరెపల్లి–తీగలగుట్టపల్లి ప్రాంతాల మధ్య రూ.45 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు కమిషనర్ భూమిపూజ చేశారు. ఈ పనులు పూర్తయితే స్థానికుల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు.
ఆర్టీసీ కాలనీలో రూ.15 లక్షల పనులు
అనంతరం తీగలగుట్టపల్లి ఆర్టీసీ కాలనీలో సుమారు రూ.15 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు కూడా భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులు ప్రారంభమైన వెంటనే వేగవంతంగా కొనసాగించాలని, ఆలస్యం జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కమిషనర్ ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యమైన సామగ్రి వినియోగించాలని, సరైన క్యూరింగ్ తప్పనిసరిగా చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. నాణ్యత లోపాలు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, పలువురు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


