పనుల్లో నాణ్యతే ప్రధానం
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల పరిశీలన
నిర్ధిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
కాకతీయ, వరంగల్ : అభివృద్ధి పనుల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వరంగల్ మహానగర పాలక సంస్థ (బల్దియా) కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పరిధిలోని దేశాయిపేట, ఎల్బీనగర్, గోవిందరాజుల గుట్ట, కాశీబుగ్గ ప్రాంతాల్లో ఆమె క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ డివిజన్లలో పూర్తైన అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, బిల్లుల చెల్లింపుకు సంబంధించిన కొలతలను తనిఖీ చేశారు. నిర్మాణ దశలో ఉన్న డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ప్రతిపాదిత ప్రధాన నాలాల పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. గోవిందరాజుల గుట్ట ప్రాంతంలో బల్దియా నిధులతో నిర్మిస్తున్న నీటి రిజర్వాయర్ పనులను పరిశీలించిన కమిషనర్, నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా సందర్శించిన ఆమె, అక్కడ నీటి శుద్ధి ప్రక్రియను, నాణ్యత నిర్ధారణ విధానాలను పరిశీలించారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీరు పూర్తిగా నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ జోషి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఈఈ సంతోష్ బాబు, డీఈలు రంగారావు, సతీష్, ఏఈలు హబీబ్, మురళీకృష్ణ, సానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.


