కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌తో వాణిజ్య అసమతుల్యతలను సవరించేందుకు కీలక చర్యలు చేపట్టాలని తన ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. సోచీలో జరిగిన వాల్దై డిస్కషన్ క్లబ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ… భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలివైన, జాతీయవాద దృక్పథం కలిగిన జ్ఞానవంతుడైన నాయకుడిగా కొనియాడారు.
పుతిన్ మాట్లాడుతూ… ప్రధాని మోదీ ఎల్లప్పుడూ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన నిజమైన జాతీయవాది, వ్యూహాత్మక దృక్పథం కలిగిన నాయకుడు. అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడం గొప్ప నిర్ణయమని అన్నారు. అమెరికా విధించిన సుంకాలు భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నప్పటికీ, రష్యా నుంచి చమురు దిగుమతులు ఆ నష్టాన్ని సమతుల్యం చేస్తున్నాయని పుతిన్ అభిప్రాయపడ్డారు. భారత్ స్వతంత్ర దేశం.. ఏ విదేశీ ఒత్తిడికీ ప్రధాని మోదీ తలొగ్గరు. భారత గౌరవం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ఆయన కాపాడుతారని నమ్ముతున్నా అని ఆయన అన్నారు.
భారత్ రష్యా నుంచి విస్తృతంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఏర్పడిన వాణిజ్య అసమతుల్యతను సవరించేందుకు చర్యలు చేపట్టాలని పుతిన్ సూచించారు. ఇందుకోసం, రష్యా భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు మరింతగా దిగుమతి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్, చెల్లింపులు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని, వీటిని పరిష్కరించగలిగితే ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని పుతిన్ పేర్కొన్నారు.
దాదాపు 15 ఏళ్ల క్రితం ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాపించాయని గుర్తుచేసిన పుతిన్, ఆ అనుబంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోందని తెలిపారు. భారత్-రష్యా మధ్య ఎప్పుడూ సమస్యలు లేదా ఉద్రిక్తతలు లేవు. మా సంబంధాలు ప్రత్యేకమైనవే అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5,6 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్నారు. ప్రతి ఏటా జరిగే భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశంలో రక్షణ ఒప్పందాలు, ఇంధన సహకారం, వాణిజ్య సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంశాలు ప్రధానంగా చర్చించారు. రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థల సరఫరా, కొత్త ఇంధన ఒప్పందాలపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.


