పేరుకే స్వచ్ఛ ఏన్కూర్
నిర్వహణలేని గ్రామ డంపింగ్ యార్డ్
కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై చెత్త కుప్పలుగా మారింది. చెత్తను సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రదేశం అంతా ప్లాస్టిక్, గృహ వ్యర్థాలు, వైద్య వ్యర్ధాలతో నిండిపోయి ఉంది. డంపింగ్ యార్డ్ కోసం నిర్మించిన షెడ్ మరియు కాంక్రీట్ వేదిక ఉన్నప్పటికీ, చెత్తను వేరు చేసి పారవేయకుండా డంపింగ్ యార్డ్ కి వెళ్లే దారిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీంతో దుర్వాసన వ్యాపిస్తూ, దోమలు, ఈగలు అధికంగా పెరుగుతున్నాయి. స్థానిక ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డ్‌ను శుభ్రపరిచి, చెత్త నిర్వహణకు సరైన విధానాలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.


