కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలు
48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
కాకతీయ, పెద్దపెల్లి : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఐదో సారి కొనుగోలు సీజన్ అని గుర్తు చేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.రైతుల పంటకు ఎలాంటి కటింగ్‌లు లేకుండా పూర్తి ధర చెల్లిస్తామని, వడ్లను అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు వడ్లను బాగా ఆరబెట్టి తేమ శాతం 17లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇకపై రైతులు రైస్ మిల్లుల వద్ద తిరగాల్సిన అవసరం లేకుండా సెంటర్ దగ్గరే ట్రక్ షీట్లు పొంది నిశ్చింతగా ఇంట్లో ఉండవచ్చని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తక్షణమే తనను సంప్రదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సరయ్య గౌడ్, కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సదయ్య, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


