ప్రారంభానికి సిద్ధమైన పుప్పాలగుట్ట పార్క్
రూ.70 లక్షలతో రూపుదిద్దుకుంటున్న సుందర ప్రాంగణం
పిల్లల ఆట వస్తువులతో పాటు ఔట్ డోర్ జీమ్ పరికరాలు ప్రత్యేక ఆకర్షణ
కాకతీయ, ఖిలావరంగల్ : పుప్పాలగుట్టలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే నిర్మితమవుతున్న పార్క్ ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబై ప్రారంభానికి సిద్ధమైంది. 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ఇప్పుడు పూర్తికావడంతో పుప్పాలగుట్ట ప్రాంతానికి ఒక నూతన ఆకర్షణగా మారబోతోంది. ఈ పార్క్‌ను పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం నుంచే ఇరువైపులా నిలువెత్తు చెట్లు, అలంకార మొక్కలు, పూల మొలకలతో సుందర వాతావరణం సందర్శకులను ఆకట్టుకుంటోంది. పార్క్ మొత్తాన్ని ఒక హల్లధాకరణ పర్యావరణం ఆవరించి, ఎక్కడ చూసినా పచ్చదనం, చల్లని గాలి, ఉదయం పక్షుల కిలకిలరావాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పార్క్‌లో ఉదయం, సాయంత్రం సమయంలో వయోభేధం లేకుండా అందరూ నడవగలిగేలా ఒక విశాలమైన వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆట వస్తువులు, ఊయలలు, స్లైడ్స్ వంటి పరికరాలు పిల్లలను ఆకట్టుకుంటాయి. యువత మరియు ఆరోగ్యంపై దృష్టిపెట్టే పెద్దల కోసం ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ జిమ్ పరికరాలు పార్క్‌కు మరింత విలువను చేర్చాయి. పార్క్‌లో శుభ్రత, భద్రత, ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిక్ టాయిలెట్స్, వాచ్మాన్ రూమ్, కూర్చొనే బెంచీలు, రాత్రివేళ అందంగా వెలిగేలా లైటింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. చెట్ల నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా సిట్టింగ్ జోన్‌లను కూడా అభివృద్ధి చేశారు. ఇటీవలి కాలంలో పుప్పాలగుట్టలో పెరిగిపోతున్న జనాభా, కాంక్రీట్ భవనాల మధ్య ఈ పార్క్ ఒక పచ్చని ఊపిరితిత్తులుగా మారబోతోంది. ప్రజలు ఉదయం నడక, యోగా, పిల్లల ఆటలు, సాయంత్రపు విశ్రాంతిగా ఉపయోగించుకునేందుకు ఇది ఒక మంచి పబ్లిక్ స్పాట్‌గా నిలుస్తోంది. పార్క్ ప్రారంభం కోసం స్థానికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రారంభం తర్వాత ఇది పుప్పాలగుట్టలో ప్రజల దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగమైపోవడం ఖాయం.


