ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్‌తో నిరుపేదలకు ధైర్యం
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
రాయపర్తి మండలంలో పల్లె దవాఖానాలు ప్రారంభం
కాకతీయ, రాయపర్తి : రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు రూ.28,03,248 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. అలాగే రాయపర్తి, ఊకల్లు గ్రామాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖానాలను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
జర్నలిస్టుల ఇళ్లకు విద్యుత్ సదుపాయం
మండలంలోని జర్నలిస్టుల ఇళ్లకు తక్షణమే విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరుతూ స్థానిక జర్నలిస్టుల సంఘం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసింది. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో గుగులోత్ కిషన్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


