కారు గుర్తుపై ప్రజల నమ్మకం పటిష్టం
: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
మున్సిపల్ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలు
కాకతీయ, నర్సంపేట : మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో భారత రాష్ట్ర సమితికు రోజురోజుకూ బలం పెరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పట్టణంలో కారు గుర్తు విజయబాటలో దూసుకుపోతున్నట్లు పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ నాడెం శాంతికుమార్ తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరగా, మాజీ జెడ్పీటీసీ పెండం రాజేశ్వరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జినూకల రాజు, యువ నాయకుడు పెండం శివానంద్‌లు పార్టీలో చేరారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన లాలు నాయక్, గాండ్ల రాజు, మేడం శీనన్న, పెల్లి దినేష్ తదితరులు బీఆర్‌ఎస్ గూటికి వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతనంగా చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నర్సంపేట ప్రజలు బీఆర్‌ఎస్‌కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


