- జడ్పీ సీఈఓ పురుషోత్తం, ఆర్డీవో కృష్ణవేణి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను జడ్పీ సీఈఓ పురుషోత్తం, మానుకోట ఆర్డీవో కృష్ణవేణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీ.ఈ.ఓ, ఆర్డీవోతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన కొండా భారతమ్మ తనకున్న సర్వే నెంబర్ లో భూమి సరిహద్దుల నిర్ణయించాలని విన్నవించారు. కేసముద్రం గ్రామానికి చెందిన పొదిల వెంకట్ రెడ్డి వృద్ధాప్యంలో ఉన్న తనను తన కుమారులు పట్టించుకోకుండా తన భూమిని సాగు చేసుకుంటూ, ఆ భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని కుమారుల నుండి తనకు రక్షణ కల్పించి ఆదుకోవాలని కోరారు.
మరిపెడ మండలం జడ్చర్ల గ్రామ పరిధి గుర్రప్ప తండకు చెందిన గుగులోతు తిరుపతి.. తాను వికలాంగుడినని తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని కోరారు. గార్ల మండలం పెద్ద కృష్ణాపురానికి చెందిన కొత్త రమేష్ తను పుట్టుకతోనే అందుడినని వైద్యశాఖ వారు 2010లో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ లో 75%గా వైకల్యం ఉన్నదని ప్రస్తుతం నా కంటి చూపు పూర్తిగా దెబ్బతిన్నదని దయచేసి తన వైకల్య శాతాన్ని పెంచి సదరం సర్టిఫికెట్ మార్పు చేసి ఇవ్వాలని కోరారు. ప్రజావాణిలో వచ్చిన 104 దరఖాస్తులకు అధికారులకు పరిష్కారానికై ఆదేశించారు. ప్రజావాణి లో డీఆర్డీఏ మధుసూదన రాజు, డీసీఓ వెంకటేశ్వర్లు, ఎల్డీఎం. యాదగిరి, కలెక్టరేట్ ఏవో పవన్ కుమార్, సూపరింటెండెంట్లు మదన్ మోహన్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


