పేద ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురంలో 74 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
కాకతీయ, గణపురం : పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం గణపురం గ్రామపంచాయతీ ప్రాంగణంలో మండలానికి చెందిన 74 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికల వివాహాలకు ఈ పథకాలు వరంగా మారాయని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సంక్షేమ పథకాల అమలులో మహిళా సంక్షేమాన్ని ప్రభుత్వం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుందని పేర్కొన్నారు.
యాసంగికి చివరి ఆయకట్టు వరకూ నీరు : గండ్ర
యాసంగి పంటల సాగుకు గణపసముద్రం చెరువు నుంచి నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సాగు చేసుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకూ సమాన ప్రాధాన్యతతో నీరందిస్తామని, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల సంరక్షణకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నీటి వృథా జరగకుండా పర్యవేక్షణను మరింత బలోపేతం చేశామని తెలిపారు.
“రైతులే మా ప్రభుత్వం కేంద్రబిందువు… వారి సంక్షేమమే మా లక్ష్యం” అని ఎమ్మెల్యే గండ్ర స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


