జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం
అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి
జీవో–252లో మార్పులు, సూచనలకు స్వాగతం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టే పాత్రికేయులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, గతంలో కంటే ఎక్కువగానే ఈసారి అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. శనివారం సచివాలయంలో తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో జీవో–252పై మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టు సంఘాలు చేసిన సూచనలు, విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి జీవో–252లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో ఉందన్నారు.
ఏ కార్డుకైనా అన్ని ప్రయోజనాలు
మీడియా కార్డు, అక్రిడిటేషన్ కార్డు మధ్య ఎలాంటి తేడా లేదని, అక్రిడిటేషన్ కార్డుదారులకు లభించే అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు మీడియా కార్డుదారులకు కూడా వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అసలైన పత్రికలు, నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సర్క్యులేషన్ వివరాలు, ఛార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన అక్రిడిటేషన్ల మంజూరుపై ఆలోచన చేస్తున్నామని, ఉర్దూ జర్నలిస్టులకు కమిటీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. క్రీడలు, సంస్కృతి, క్రైమ్, కేబుల్ టీవీ విభాగాల జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ సౌకర్యం ఉంటుందని, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక కోటా కేటాయిస్తామని వెల్లడించారు. డిజిటల్ మీడియా కార్డులు దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే జారీ చేశామని గుర్తు చేశారు.
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు కొత్త విధానం
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై స్పందించిన మంత్రి, కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఐ&పిఆర్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, సీపీఆర్‌వో జి. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.


