కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో బుధవారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
మంత్రి సీతక్క జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు వివరించి, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. అనంతరం పలు లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ చేశారు.ములుగు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతా పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు. ప్రజా పాలనలో పోలీసుల పాత్ర ముఖ్యమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఏఎస్‌పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఆర్డీఓ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


