మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
కాకతీయ,సంగెం: అనారోగ్య కారణాల చేత మృతి చెందిన మృతుడి కుటుంబానికి శ్రీ లక్ష్మీ గణపతి పరపతి సంఘం వారు ఆర్థిక సహాయం అందజేశారు. సంగెం మండలంలోని ఎలుగురు రంగంపేట గ్రామానికి చెందిన శ్రీ జనగాం జగన్నాథం అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో సంఘం తరఫున రూ.30,000 నగదు సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘంలోని ప్రతి సభ్యుని సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సభ్యుల కుటుంబాల్లో ఎలాంటి అకాల మరణాలు సంభవించినా సంఘం ముందుండి ఆర్థిక సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సభ్యుల ఐక్యతను, పరస్పర సహకార భావనను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. కమిటీ కార్యదర్శి మండల రాజు మాట్లాడుతూ సంఘం స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశ్యం పరస్పర సహకారం మరియు సేవా దృక్పథమని తెలిపారు. సభ్యులందరూ సహకరించి ఈ సహాయాన్ని అందించడంలో భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాశ్వత సభ్యులు జనగాం రమేశ్, సంబరాజు అజయ్, మాజీ సర్పంచ్ పోతుల ప్రభాకర్, కమిటీ సభ్యులు గట్ల సత్యం, బందెల రమేశ్ బాబు, జనగాం శ్రీనివాస్ (ఎల్ఐసీ), జనగాం సుదర్శన్, జనగాం వీరస్వామి, రావుల వెంకన్న, వల్లేపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంఘం నిర్వహించిన ఈ ఆర్థిక సహాయ కార్యక్రమం గ్రామంలో సేవాభావాన్ని ప్రతిబింబిస్తూ ఆదర్శంగా నిలిచింది.


