కర్తవ్యపథ్‌పై గర్వభారతం!
డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం
రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా సైనిక శక్తి ప్రదర్శన
కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఈ ఉదయం జాతీయ గర్వంతో తళతళలాడింది. పందొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ దేశం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. చలిగాలులు వీచినా, కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగింది. సైనిక విన్యాసాలు, రంగురంగుల శకటాలు, అద్భుత వైమానిక ప్రదర్శనలతో వేడుకలు కన్నుల పండువగా సాగాయి. ఈసారి వేడుకలకు ప్రత్యేక మెరుపును చేకూర్చుతూ ‘వందేమాతరం’కు నూట యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ భావధారను ప్రతిబింబించే కళాఖండాలు, సంగీత నినాదాలు కర్తవ్యపథ్‌ను నింపాయి. బంకింబాబు వారసత్వం ప్రతి దృశ్యంలోనూ ప్రతిధ్వనించింది.

వేడుకల క్రమం ఇలా…
ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రధానమంత్రి జాతీయ యుద్ధ స్మారక స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. పది గంటల పదిహేను నిమిషాలకు రాష్ట్రపతి గౌరవ వేదికకు చేరుకున్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన, స్వదేశీ తుపాకులతో ఇరవై ఒకటి గన్ సల్యూట్ నిర్వహించారు. పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు తొంభై నిమిషాల గణతంత్ర పరేడ్ ప్రారంభమైంది. గణతంత్ర వేడుకలకు తొలిసారిగా యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇద్దరు అగ్ర నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ కలిసి పాల్గొనడం భారత్–యూరప్ సంబంధాలకు కొత్త ఉత్సాహన్నిచ్చింది. వాణిజ్యం, స్వచ్ఛ శక్తి, డిజిటల్ సాంకేతిక రంగాల్లో ఇరు పక్షాల భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఈ సందర్శన స్పష్టం చేసింది.
పరేడ్‌లో సైనిక వైభవం
ఈ ఏడాది సైన్యం యుద్ధ పరిస్థితులను ప్రతిబింబించే ‘బాటిల్ అరే’ క్రమంలో మార్చ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ లైట్ కమాండో బెటాలియన్ తొలిసారి పరేడ్‌లో పాల్గొంది. స్వదేశీ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ఆత్మనిర్భర్ భారత్‌కు బలమైన ప్రతీకగా నిలిచింది.
వేడుకల ముగింపుగా ఇరవై తొమ్మిది విమానాలతో భారత వైమానిక దళం నిర్వహించిన ఫ్లైపాస్ట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు గర్జిస్తూ కర్తవ్యపథ్‌పై దూసుకెళ్లాయి. పూలవర్షం కురిపించిన దృశ్యం దేశ సైనిక శక్తికి ప్రతీకగా నిలిచింది.
రంగురంగుల శకటాలు – భారత వైవిధ్యానికి అద్దం
మొత్తం ముప్పై శకటాలు పరేడ్‌లో ప్రదర్శించబడ్డాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖల శకటాలు భారత సాంస్కృతిక వైవిధ్యం నుంచి ఆధునిక అభివృద్ధి వరకు దేశ వైభవాన్ని సజీవంగా చూపించాయి. రాజ్యాంగ ఆత్మ, సైనిక శక్తి, సాంస్కృతిక వైభవం కలసి కర్తవ్యపథ్‌పై అవతరించాయి. డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం భారత ప్రజాస్వామ్య బలాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.


