- పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించిన ప్రభుత్వం
- ఇంటర్నెట్ సేవలు బంద్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. పీవోకేలో ప్రధాని షెహ్‌బాబ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలు కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. పాక్ ప్రభుత్వం తమను దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నదని మండిపడ్డారు. 70 ఏళ్లకు పైగా పీవోకేలో తమకు ప్రాథమిక హక్కులు కూడా కల్పంచలేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈక్రమంలోనే పీవోకేలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమకు విముక్తి కల్పించాలని కోరుతూ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. తమ ఆందోళనలు ఏ సంస్థకూ వ్యతిరేకం కాదని ఏఏసీ కీలక నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ అన్నారు. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యత అని నినదించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో అక్కడి ప్రభుత్వం పీవోకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది.


