కోట భూములు రక్షించండి
ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టండి
కలెక్టర్లకు లేఖలు రాసినా స్పందన లేదు
కోట భూములను ఏఎస్ ఐ పరిధిలోకి తీసుకురావాలి
కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ కోట భూముల ఆక్రమణలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు 2026 జనవరి 6న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఆయన, కాకతీయుల కాలం నాటి అపురూప చారిత్రక వారసత్వాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని స్పష్టం చేశారు. వరంగల్ కోట భూములను భారత పురావస్తు శాఖ (ఏఎస్ ఐ)కు చెందినవిగా గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో తక్షణమే మార్పులు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన వరంగల్ కోట చుట్టూ ఒకప్పుడు ఏడు ప్రాకారాలు ఉండేవని, ప్రస్తుతం అందులో కేవలం మూడు మాత్రమే మిగిలి ఉన్నాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన ప్రాకారాల భూముల్లో స్థానికులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టి చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. కోట చుట్టూ ఉన్న మట్టి గోడలు, రాతి గోడలను కూల్చివేస్తూ ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత శాఖలు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
నోటీసులకే పరిమితమైన ఏఎస్ఐ చర్యలు
వరంగల్ కోట భూముల ఆక్రమణలపై గతంలో ఏఎస్ ఐ అధికారులు జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఫలితం లేకపోయిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 04-11-2022, 01-12-2025, 03-12-2025 తేదీల్లో కలెక్టర్‌కు లేఖలు ఇచ్చినా, ఆక్రమణల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణదారులపై పురావస్తు శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ కోట భూములు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో “ప్రభుత్వ భూమి”గా నమోదై ఉండటం సమస్యలకు కారణమవుతోందని, వాటిని వెంటనే ASI భూములుగా సవరించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ఇందుకోసం భారత పురావస్తు శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ఈ ఆక్రమణల విషయం తన దృష్టికి వచ్చిందని, అప్పటి నుంచే ఈ అంశంపై ఆందోళనతో ఉన్నట్లు కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు వరంగల్ కోట వంటి చారిత్రక కట్టడాలు అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.డి


