గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి
భక్తులకు ఇబ్బందుల్లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి
సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లపై మంత్రి ఆదేశాలు
కాకతీయ, పెద్దపల్లి : ధర్మారం మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ *కోయ శ్రీహర్ష*తో కలిసి ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి, ఎంపిడిఓ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గత అనుభవాల ఆధారంగా వివిధ గ్రామాలకు వచ్చే భక్తుల అంచనాలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని పేర్కొంటూ పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జాతర జరిగే గ్రామాలకు ఇన్‌చార్జీలుగా పంచాయతీ కార్యదర్శులను నియమించినట్లు తెలిపారు. గ్రామాల్లో గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు చేస్తామని, అవసరమైన విద్యుత్ పోల్స్ ఏర్పాటుకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. మేడారం జాతర కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.272 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జాతర కమిటీలతో సమన్వయంతో పనులు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం మంత్రి, కలెక్టర్‌తో కలిసి ధర్మారం మండల కేంద్రంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను సందర్శించారు.


