రాకకు ముందే హామీలు నెరవేర్చాలి
భద్రాచలం అభివృద్ధిపై ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై తేల్చండి
ప్రక్రియపై స్పష్టతనిచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేపట్టాలి
సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్
కాకతీయ, భద్రాచలం : ముఖ్యమంత్రి పర్యటనకు ముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భద్రాచలం అభివృద్ధిపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. భద్రాచలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం పట్టణాన్ని ముంపు నుంచి కాపాడేందుకు కరకట్ట పునర్నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తూ సమగ్ర మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని అన్నారు. మాడవీధుల అభివృద్ధి కారణంగా స్థలాలు కోల్పోయిన పేదలకు శ్రీరామనవమి నాడే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వ్యాపార సముదాయాలు కోల్పోయిన చిరు వ్యాపారస్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇవ్వాలని కోరారు. రామాలయం పరిసరాల్లో కరకట్టపై పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. భద్రాచలం కేంద్రంగా ఇసుక రీచ్ లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, అడ్డంకులు తొలగించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక రీచ్ నిర్వహించాలని కోరారు. రామాలయ అభివృద్ధి పనులపై మాస్టర్ ప్లాన్‌తో పాటు నిధుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ధ్వంసమైన రోడ్లకు నిధులు విడుదల చేయాలని, న్యాయ కళాశాల ఏర్పాటు పై స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు సత్తిబాబు, పట్టణ నాయకులు ఎర్రం శెట్టి వెంకట్రామారావు, పారిల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


