నేరాల నియంత్రణలో పురోగతి
కరీంనగర్ కమిషనరేట్‌లో 16.84 శాతం తగ్గుదల
6,421 కేసులు నమోదు – 5,126 కేసులు చేధన
రూ.2.04 కోట్ల ఆస్తి రికవరీ
2025 వార్షిక నేరాల నివేదిక విడుదల చేసిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పనితీరు, నేర నియంత్రణకు తీసుకున్న చర్యలు, ప్రజా భద్రతకు చేపట్టిన కార్యక్రమాలపై కీలక గణాంకాలను వెల్లడించారు. వార్షిక నివేదిక ప్రకారం 2025లో మొత్తం 6,421 నేర కేసులు నమోదు కాగా, 2024లో నమోదైన 7,361 కేసులతో పోలిస్తే నేరాల్లో 16.84 శాతం తగ్గుదల నమోదైనట్లు సీపీ తెలిపారు. ఇది జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ సాధించిన ముఖ్యమైన విజయమని పేర్కొన్నారు. ముందస్తు చర్యలు, పటిష్టమైన గస్తీ, నిఘా వ్యవస్థ బలోపేతం, ప్రజలతో సమన్వయంతో అమలు చేసిన పోలీసింగ్ కార్యక్రమాల ఫలితంగానే నేరాల తగ్గుదల సాధ్యమైందని వివరించారు.
కేసుల ఛేదింపులో మెరుగైన ఫలితాలు
2025లో నమోదైన కేసుల్లో భారతీయ దండన విధానం (ఐపీసీ) మరియు ప్రత్యేక చట్టాల కింద మొత్తం 5,126 కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు సీపీ తెలిపారు. ఆధునిక సాంకేతికత వినియోగం, టాస్క్‌ఫోర్స్ దాడులు, సైబర్ నిఘా, క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది సమన్వయం వల్లే కేసుల పరిష్కారంలో మెరుగైన ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఆస్తి నేరాల విభాగంలో 2025లో మొత్తం 505 కేసులు నమోదు కాగా, వాటిలో 251 కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో రూ.4.11 కోట్ల విలువైన ఆస్తి నష్టం నమోదు కాగా, అందులో నుంచి రూ.2.04 కోట్ల విలువైన ఆస్తిని రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించినట్లు సీపీ వెల్లడించారు. దీంతో ఆస్తి రికవరీ శాతం 49.62 శాతానికి చేరిందన్నారు. అదేవిధంగా జిల్లాలో గ్రేవ్ క్రైమ్స్‌లో 9.09 శాతం, మహిళలపై నేరాల్లో 5.18 శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. వరుసగా రెండేళ్లుగా డకాయిటీ కేసులు ఒక్కటీ నమోదు కాకపోవడం కరీంనగర్ పోలీస్ శాఖ సాధించిన ప్రత్యేక విజయమని పేర్కొన్నారు.
కోర్టుల్లో పోలీసుల విజయం
2025లో మొత్తం 2,531 కేసులు కోర్టుల వరకు వెళ్లగా, వాటిలో 781 కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. దీంతో శిక్షల శాతం 30.85 శాతానికి చేరిందని, గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతంలో 7 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. ఇది దర్యాప్తు నాణ్యత మెరుగుపడటం, కేసులపై క్రమం తప్పని కోర్టు మానిటరింగ్ చేపట్టిన ఫలితమని వివరించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి 205 కేసులను ఛేదించడంతో పాటు, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ ద్వారా బాధితులకు రూ.1.10 కోట్లకు పైగా నగదు రిఫండ్ చేయడం జరిగిందన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రానున్న రోజుల్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్పష్టం చేశారు.


