విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం
కాకతీయ, నర్సంపేట: ఆహారాన్ని వృథా చేయకుండా ప్రతి మెతుకును గౌరవించాలని డఫోడిల్స్ పాఠశాల చెర్మన్ చింతల నరేందర్ అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు లేనిదే దేశం లేదని పేర్కొన్నారు. ఎండ, వాన, చలి అన్నీ తట్టుకుంటూ రైతులు చేసే కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. మనం తినే ప్రతి మెతుకు రైతుల శ్రమ ఫలితమేనని, అందుకే ఆహారాన్ని గౌరవంతో వినియోగించాలని సూచించారు. పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, విలువలు, క్రమశిక్షణ పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసానికి డఫోడిల్స్ పాఠశాల వేదికగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్, డీన్ ఇందుమతి, ప్రధానోపాధ్యాయులు అజీముద్దీన్, ఉప ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. రీటా, హెచ్.ఆర్.డి విజయలక్ష్మి, శశికల, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


