బాలుడి మృతదేహంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముట్టడి
నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది సస్పెండ్ చేయాలంటూ ఆగ్రహం
మంత్రి సీతక్క హామీతో ధర్నా విరమణ
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామంలో 7 ఏళ్ల బాలుడు పాము కాటుతో మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గూర్రేవుల గ్రామానికి చెందిన తిరునగిరి రాజు, సంగీత దంపతుల కుమారుడు హరినాథ్ (7) శనివారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా నాగుపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే విధుల్లో ఉన్న వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ “యాంటీడోస్ ఇంజెక్షన్ లేదు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తదుపరి నాటు వైద్యుడి వద్దకు బాలుడిని తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్సకు నిరాకరించాడు. అనంతరం 108 అంబులెన్సులో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు ఆదివారం కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బాలుడి మృతదేహంతో ముట్టడి చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరని, ప్రథమ చికిత్స కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం గ్రామస్తులు, బంధువులు కలిసి ఏటూరునాగారం–తుపాకులగూడెం ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు మృతదేహంతో ధర్నా నిర్వహించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని, బాధ్యులైన వైద్యుడు అభినవ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, జిల్లా కలెక్టర్ దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు — మంత్రి సీతక్క
ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు యం.డి. అప్సర్ పాషా ఫోన్ ద్వారా మంత్రి సీతక్కకు సమాచారం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క బాలుడి మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కన్నాయిగూడెం మండలంలో 24 గంటల వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.



