వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు బందోబస్తు
ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని *శ్రీ వేంకటేశ్వర దేవస్థానం*లో జనవరి 23 నుంచి 29 వరకు జరగనున్న శ్రీ లక్ష్మి, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన సీపీ బందోబస్తు మ్యాప్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ల వద్ద బారికేడింగ్, కళ్యాణ మండపం వద్ద ప్రత్యేక నిఘా, ప్రసాద వితరణ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. మార్కెట్ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


