ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటు
హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరగబడతాం
ప్రభుత్వానికి ఆశా వర్కర్ల హెచ్చరిక
కాకతీయ, చేర్యాల : చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా చేర్యాల పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటని ఆశావర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేర్యాల మండలంలోని పలువురి ఆశా కార్యకర్తలను శుక్రవారం చేర్యాల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు ఆశావర్కర్ల ఇంటికి వెళ్లి వారిని బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై ఆశావర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్బంగా పలువురు ఆశా వర్కర్లు మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. కనీస వేతనం అందజేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. తక్కువ పారితోషికంతో ఎక్కువ పని చేయించుకోవడం అన్యాయమని, ఆశావర్కర్లకు తక్షణమే 18 వేల గౌరవప్రదమైన కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టులు, అవమానాలు ఆపాలని కోరారు. ఫిక్స్డ్ వేతనం, భద్రత, బీమా, మట్టి ఖర్చులు వంటి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో కవిత, రమాదేవి, నాగమణి, సరళ, నాగలక్ష్మి,విజయ, పద్మ కవిత హైమావతి,జ్యోతి మంజుల ఉన్నారు.


