దళితులపై మాట్లాడే హక్కు ప్రవీణ్‌కు లేదు
కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పొద్దు
బీఆర్ఎస్ హామీలన్నీ బూటకమే
పరకాలలో కాంగ్రెస్‌కు ప్రజల ఆశీస్సులు ఖాయం
కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
కాకతీయ, పరకాల : దళితుల సంక్షేమం గురించి మాట్లాడే నైతికత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏమాత్రం లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోడెల మౌనిష దిలీప్, 21వ వార్డు అభ్యర్థి సూదమల్ల రమేష్ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతితో కలిసి రేవూరి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పరకాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రణాళికాబద్ధంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
అబద్ధాల ప్రచారం ఆపాలి
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న పరకాలలో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రేవూరి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ కుట్ర చేసి బాంబులు పెట్టి కూల్చేసిందని ప్రవీణ్ మాట్లాడటం పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. ఓ ఐఏఎస్‌గా పనిచేసిన వ్యక్తి కనీస బాధ్యత లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. “కేసీఆర్ దళితుల కోసం ఏం చేశాడో చెప్పాలి. బీఆర్ఎస్ పాలనలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ఎన్ని కుటుంబాలకు మేలు జరిగింది?” అని ప్రశ్నిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్‌కు రేవూరి సవాల్ విసిరారు. దళిత నాయకుడిగా చెప్పుకునే ప్రవీణ్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపై ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.
బీఆర్ఎస్ మోసపూరిత హామీలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, దళితబంధు వంటి హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. పరకాల పట్టణం నిజమైన అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ఒక్కటే మార్గమని రేవూరి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని, బీఆర్ఎస్ అబద్ధాలను ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.


