ప్రతిమ’ స్టడీ హాల్ ప్రారంభం
నిరుద్యోగ యువతకు ప్రశాంత అధ్యయన వేదిక
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని వసతులు
ఏడేళ్లలో 300 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
విద్యార్థులకు నిరంతర సహకారం : మాజీ ఎంపీ వినోద్‌కుమార్
కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ‘ప్రతిమ’ స్టడీ హాల్‌ను మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణితో కలిసి ప్రతిమ మల్టీప్లెక్స్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ స్టడీ హాల్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తాను కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రశాంతంగా చదువుకునే వసతులు లేవని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ క్రమంలో ప్రతిమ ఫౌండేషన్‌తో చర్చించి, వారి సహకారంతో 2018 జనవరిలో కలెక్టరేట్ రోడ్డులోని కృషి భవన్‌లో అప్పటి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ప్రతిమ స్టడీ సెంటర్‌ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
300 మందికి ఉద్యోగాలు
గత ఏడేళ్లుగా ప్రతిమ ఫౌండేషన్ అన్ని నిర్వహణ ఖర్చులు భరిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తోందని ప్రశంసించారు. ఈ స్టడీ సెంటర్‌లో చదువుకున్న విద్యార్థుల్లో సుమారు 300 మంది గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, పోలీస్, బ్యాంకింగ్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. కృషి భవన్ పాత భవనం కావడంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పునరుద్ధరణ చేపట్టనున్న నేపథ్యంలో, ఇతర ప్రాంతాల్లో అనువైన స్థలం లభించక ప్రతిమ స్టడీ సెంటర్‌ను ప్రతిమ హోటల్ రెండో అంతస్థుకు తరలించి పునఃప్రారంభం చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణి మాట్లాడుతూ.. వినోద్ కుమార్ సూచన మేరకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడేళ్లలో ఈ స్టడీ హాల్ ద్వారా సుమారు 300 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టడీ సెంటర్ అభివృద్ధికి సేవలందించిన డాక్టర్ హరిణి, డాక్టర్ ప్రతీక్, రాఘవేంద్ర బాబులను వినోద్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో భారాస విద్యార్థి విభాగం నాయకులు జక్కుల నాగరాజు, దూలం సంపత్, శ్రీనాథ్ గౌడ్, విజేందర్ రెడ్డి, సాయి, ఓంకార్, నిఖిల్ రావు, రాజేష్‌తో పాటు భారాస నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి, కంకణాల విజేందర్ రెడ్డి, జక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు.


