తాడికల్‌లో “ప్రజా బాట” కార్యక్రమం
రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన
కాకతీయ,శంకరపట్నం : మండలంలోని తాడికల్ గ్రామంలో మంగళవారం రోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో “ప్రజా బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలో పర్యటిస్తూ రైతులకు విద్యుత్ వినియోగం, భద్రతపై అవగాహన కల్పించారు. వ్యవసాయానికి విద్యుత్ అత్యంత కీలకమని పేర్కొంటూ, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యవసాయ బావుల వద్ద ఇనుప డబ్బాలు వినియోగించడం ప్రమాదకరమని, వాటి స్థానంలో ప్లాస్టిక్ బాక్స్‌లు ఉపయోగించాలని సూచించారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నా లేదా కరెంట్ వైర్లు వేలాడుతున్నా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. స్వయంగా కరెంట్ లైన్లకు దగ్గర కావద్దని, ఎలాంటి సమస్య ఎదురైనా అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ ఏ. సమ్మయ్య, లైన్మెన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైన్మెన్ కుమార్, సంపత్ తదితర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


