మరిపెడ మునిసిపల్ చైర్‌పర్సన్‌గా ప్రగతి
వైస్ చైర్మన్‌గా కాలం సునీత
15 వార్డుల్లో 9 గెలిచి కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ
ప్రమాణ స్వీకారం అనంతరం పరోక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి
కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహం
కాకతీయ, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా కాలం సునీత ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరిపెడ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 9 వార్డులను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్‌కు లాంఛనప్రాయంగా మారింది. సమావేశం ప్రారంభంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీతలు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మరిపెడ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మెజారిటీతో మరిపెడ మున్సిపాలిటీలో పాలన ప్రారంభం కావడంతో అభివృద్ధి పనులకు వేగం పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.


