ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సుప్రీంకోర్టు నుంచి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు ఊరట
అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కీలక ఉత్తర్వులు
దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలని ఆదేశం
సాక్ష్యాలను తారుమారు చేస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరిక
ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దని ఆదేశం
కాకతీయ,తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే అరెస్టు నుంచి రక్షణ ఇచ్చినప్పటికీ దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అధికారులు పిలిచినప్పుడు తప్పకుండా విచారణకు హాజరుకావాలని ప్రభాకర్‌రావుకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తారుమారు చేయకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తే ముందస్తు బెయిల్ వెంటనే రద్దు అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే విధంగా ఈ కేసులో ఉన్న సాక్షులను ప్రభావితం చేయడం, భయపెట్టడం వంటి చర్యలు తీసుకుంటే కూడా కోర్టు కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపింది. ప్రభాకర్‌రావు ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లకూడదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. తన పాస్‌పోర్టును అధికారులకు అప్పగించాలని కూడా ఆదేశించింది. ఇటీవల అనారోగ్య కారణాలతో ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారని సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన త్వరలోనే భారత్‌కు వచ్చి దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యే అవకాశం ఉందని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.


