ప్రజల విశ్వాసంపైనే పదవులు
రాహుల్ గాంధీపై విమర్శలు తగదు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం కౌంటర్
కాకతీయ, కరీంనగర్ : రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం తమ పార్టీ హక్కు అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది వ్యక్తులు కాదని, ప్రజలేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావని, అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని అన్నారు. గత 12 ఏళ్లుగా దేశ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని, ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తున్నారని తెలిపారు. ధరలు విపరీతంగా పెరిగినా పేదలను ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విద్వేష రాజకీయాలతో మైనార్టీలు, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని అధికారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్ష ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం జరుగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని వ్యాఖ్యానించారు. దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. ఆయనపై విమర్శలు చేయడం ఆకాశం మీద ఉమ్మి వేసినట్టేనని బండి సంజయ్ గుర్తుంచుకోవాలని అన్నారు.రెండు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయినప్పటికీ తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాలేదని బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. తన వ్యవహారశైలిని మార్చుకోవాలని సూచించారు.


