పొన్నం రవిచంద్రకు
గద్దర్ ఫిల్మ్ అవార్డు
ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్ యాక్షన్ హీరో’ ..
కవులు, రచయితలు, సినీ ప్రేమికులు హర్షం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర రూపొందించిన ‘ద ఫస్ట్ యాక్షన్ హీరో’ డాక్యుమెంటరీకి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో 2025 సంవత్సరానికి సంబంధించిన తెలుగు చిత్రాల అవార్డులను ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగంలో ఈ చిత్రం ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైంది. బాలీవుడ్‌లో 300కుపైగా చిత్రాల్లో నటించి, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు పొందిన తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ వ్యక్తి పైడి జయరాజ్ జీవితం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందింది. ఆయన సినీ ప్రయాణం, కృషి, సాధించిన విజయాలను ఇందులో ప్రతిబింబించారు.సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత అయిన పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా గత ఎనిమిదేళ్లుగా సినీ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ కోసం ముంబైలో పైడి జయరాజ్ కుటుంబ సభ్యులను కలుసుకుని అరుదైన ఫోటోలు, వీడియోలను సేకరించి చిత్రాన్ని రూపొందించారు. డాక్టర్ పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడం పట్ల జిల్లాకు చెందిన కవులు, రచయితలు, సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. సాహిత్య, సాంస్కృతిక, కళా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


