పార్లమెంట్ కార్యాలయం వద్ద పొలిటికల్ వార్!
కరీంనగర్‌లో కాంగ్రెస్–బీజేపీ ఢీ… నినాదాలతో రణరంగం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ బీజేపీ కార్యాలయం వద్ద గురువారం హైటెన్షన్ నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసు అంశాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, అక్కడికి చేరుకున్న బీజేపీ శ్రేణులతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ హోరాహోరీగా ఎదురుదిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంట్ కార్యాలయం వైపు ర్యాలీగా చేరేందుకు ప్రయత్నించగా, ముందుగానే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ శ్రేణులు కూడా అక్కడికి చేరడంతో నినాదాల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిసర ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.
కాంగ్రెస్ కార్యాలయం వైపు బీజేపీ కదలిక
పార్లమెంట్ కార్యాలయం వద్ద జరిగిన పరిణామాల అనంతరం బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. దీంతో పరిస్థితి మరింత చేయి దాటే ప్రమాదం కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనతో నగర కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్లు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసు చట్టపరమైన అంశమని, దీనిని రాజకీయంగా మలచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
‘2008 నుంచే కేసు… మోదీ ప్రభుత్వంతో సంబంధం లేదు’
నేషనల్ హెరాల్డ్ కేసు 2008లోనే ప్రారంభమైందని, ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ నేతలు విస్మరిస్తున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోందని మండిపడ్డారు. ఈ కేసును రాజకీయ రంగు పులిమి ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్‌కు తగదని హెచ్చరించిన బీజేపీ నేతలు, ఇలాంటి రాజకీయ ఆటలు కొనసాగితే తగిన గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. అవసరమైతే తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని బీజేపీ శ్రేణులు హెచ్చరించాయి.


