- పార్టీలకతీతం.. సామాజిక సమీకరణమే కీలకం
- ప్యానెల్ గెలుపే టార్గెట్‌గా అభ్యర్థుల ప్రచారం
- త్రిముఖ పోరుతో వేడెక్కిన వాతావరణం
- కరీంనగర్ బ్యాంకు ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా ఉత్కంఠ
- ఎన్నికల్లో గెలుపునకు నేతల నిశ్శబ్ద వ్యూహాలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో త్రిముఖ ప్యానల్ ల మధ్య ప్రచారం పోటీ నెలకొంది. మూడు బలమైన ప్యానళ్ల మధ్య అర్బన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతి ప్యానల్ ప్రచారాన్ని మరింత వేగం పెంచి శక్తినంతా వినియోగిస్తోంది. ప్రచార బాటలో ఆరోపణలు, ప్రతిఆరోపణలు, సమావేశాలు, రహస్య కూటములు, వ్యూహాత్మక అంచనాలు ఓటర్లలో ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి గెలుపు మా దే అంటూ ప్యానల్ నేతలు శక్తివంతమైన హామీలతో ఓటర్ల వద్దకు చేరుతున్నారు. అభ్యర్థుల దూకుడు, ప్యానల్ నాయకుల తీరుతో అర్బన్ బ్యాంకు ఎన్నికలు పవర్ గేమ్గా మారాయి. నగర రాజకీయాల్లో సమీకరణాలు మారుతాయా ? లేక పాత బృందమే ఆధిపత్యం చెలాయిస్తుందా ? అన్నది నవంబర్ ఫలితాల వరకు సస్పెన్స్‌గా మారింది.
ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోటీ
అర్బన్ బ్యాంక్ పాలకమండలి ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు తప్పనిసరిగా కనిపిస్తోంది. మూడు ప్యానళ్లూ బరిలోకి దిగడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ప్రతి ప్యానల్ తమ గెలుపు కోసం వ్యూహాత్మకంగా కదులుతోంది. కర్ర రాజశేఖర్ ప్యానల్ లో అభ్యర్థులు గా జనరల్ కేటగిరీలో ఎలబోయిన శ్రీనివాస్ రెడ్డి, తాడా వీరారెడ్డి, బాశేట్టి కిషన్, కర్ర రాజశేఖర్, దేశ వేదాద్రి, బొమ్మరాతి సాయి కృష్ణ, తాటికొండ భాస్కర్, బండి ప్రశాంత్ దీపక్, ఏండీ షమియుద్దీన్. మహిళ కేటగిరీలో ముద్దసాని శ్వేత, వరాల జ్యోతి. ఎస్సీ కేటగిరీలో సరిళ్ల రత్నరాజు ఉండగా, వెలిచాల రాజేందర్ ప్యానల్ అభ్యర్థులు గా జనరల్ కేటగిరీలో అనారాసు కుమార్, ఈ.లక్ష్మన్ రాజు, ఊయ్యల ఆనందం, కూసరి అనిల్ కుమార్, గాదే కార్తీక్ సాయి, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, వజీర్ అహ్మద్, మూల వెంకట రవీందర్ రెడ్డి. మహిళ కేటగిరీలో దామెర శ్రీలత, మునింపల్లి ఫణిత. ఎస్సీ కేటగిరీలో అనంత రాజు మన్నె అభ్యర్దులు గా ఉన్నారు. ఇక గడ్డం విలాస్ రెడ్డి ప్యానల్ అభ్యర్థులు జనరల్ కేటగిరీలో 9 మంది, ఎస్సీ కేటగిరీలో ఒకరు, మహిళ కేటగిరీలో ఒకరు ఉన్నారు. ఈ మూడు ప్యానళ్లూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు బరిలోకి దిగగా అర్బన్ బ్యాంకు ఎన్నికలు ఇప్పుడు కరీంనగర్ లో ప్రతిష్టాత్మక పోరాటంగా మారడమే కాకుండా అసక్తి కరంగా మారాయి. ఇదీలా ఉండగా ఓటర్ల మనసు దక్కించుకోవడానికి ప్యానల్ నాయకులు వేగంగా ప్రచారం సాగిస్తూ చివరి నిమిషం వరకు హీట్ పెంచే అవకాశాలు కనబడుతున్నాయి.
నేతల నిశ్శబ్ద వ్యూహాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారిన అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఈసారి భిన్నంగా సాగుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పార్టీ పేర్లతో ప్యానల్‌లు లేకుండా, ఏ రాజకీయ జెండా లేకుండా జరుగుతున్న ఈ ఎన్నికల వెనుక అసలు వ్యూహం ఏమిటి ? అనే ప్రశ్న ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. రాజకీయంగా బలమైన సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగించేందుకు ఇదే సరైన సమయం అని భావించిన కొన్ని వర్గాలు పార్టీ పేర్లకు దూరంగా ఉంటూ స్వతంత్ర ప్యానల్‌లను ఏర్పరచుకున్నట్లు సమాచారం. మా అభ్యర్థులు పార్టీకి చెందలేదు కానీ గెలిస్తే మా వారే అంటూ పరోక్ష సూచనలు ఇస్తున్న నాయకుల వైఖరి మరింత అనుమానాలు రేపుతోంది. వ్యక్తిగతంగా ప్యానళ్లు ఏర్పాటు చేసుకున్న అభ్యర్థులు కూడా పార్టీ పరిమితులను దాటి ఏకమవడంతో ఈ ఎన్నికలు సాధారణ సహకార పోటీ కాకుండా సామాజిక సమీకరణాలు, రాజకీయ మౌన వ్యూహాలు కలిసిన నిశ్శబ్ద యుద్ధంగా మారాయి.
ఇంకా ఒక్క రోజే ఎన్నికల కౌంట్‌డౌన్ ప్రారంభం
కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలకమండలి ఎన్నికలకు కేవలం ఒక్కరోజే మిగిలింది. నవంబర్ 1న ఉదయం పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అభ్యర్థులు, ప్యానల్‌లు, మద్దతుదారులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. త్రిముఖ పోరుగా మారిన ఈ ఎన్నికల్లో ప్రతి ప్యానల్ గెలుపు కోసం అఖరి దశలో ప్రచార వేగాన్ని పెంచింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో రాత్రింబవళ్లు కృషి చేస్తూ ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. జిల్లాలో అధికార పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంతో ఈసారి ఫలితాల అంచనాలు క్లిష్టంగా మారాయి. ఓటర్ల సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రభావం, అంతర్గత వ్యూహాలు అన్నీ కలగలిసి ఆసక్తికర సమీకరణాలు ఏర్పరిచాయి. పోలింగ్ ముగిసేలోపు ఏ ప్యానల్ ముందంజలో ఉంటుందో చూడాలని అందరి చూపు నిలిచింది. నవంబర్ 1 సాయంత్రానికి వెలువడే ఫలితాలతో కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల ఉత్కంఠకు తెరపడనుంది.


