జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు
ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది
గిర్నిబావి జన సందోహం
డీజే, బాణాసంచా మోతలు..
పోలీసుల పటిష్ట బందోబస్తు
కాకతీయ, దుగ్గొండి: రాజకీయ జాతరగా పేరుగాంచిన కొమ్మాల జాతరకు మండలంలోని వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పెద్దఎత్తున వందకుపైగా ప్రభలను తరలించారు. మండలంలోని వివిధ గ్రామాలతో పాటుగా నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల నుండి గిర్నిబావికి చేరుకోగా పోలీసులు తొలుత కాంగ్రెస్ అనంతరం బీఆర్ఎస్ ప్రభలకు అనుమతించారు. దీంతో ఉదయం 7 గంటనుండి సాయంత్రం 4 గంటల వరకు గిర్నిబావి జనంతో కిక్కిరిసిపోయింది. ప్రభలను చూడటానికి వివిధ గ్రామాల నుండి వేలాది సంఖ్యలో ప్రజలు పెద్ద ఎత్తున గిర్నిబావికి తరలిరావడంతో జనసంద్రంగా మారింది. భారీగా జనం చేరుకోవడం.. పెద్ద సంఖ్యలో ప్రభలు రావడంతో డీసీపీ అంకితకుమార్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐలు సాయిరమణ, శ్రీనివాస్, ఎస్సైలు రణదీర్, రఘపతి, రాజశేఖర్, ట్రాఫిక్ నియంత్రిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


ప్రభలను ప్రారంభించిన దొంతి, పెద్ది
వివిధ గ్రామాల నుండి గిర్నిబావికి వచ్చిన కాంగ్రెస్ ప్రభ బండ్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి టెంకాయలు కొట్టి ప్రారంభించగా… బీఆర్ఎస్ ప్రభలను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి కిరణ్ రెడ్డి, ఓలిగే నర్సింగ రావు, నాయకులు బండారి ప్రకాష్, డ్యాగం శివాజీ, బీఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజుకుమార్, మండల పార్టీ అధ్యక్షులు సుకినె రాజేశ్వర్ రావు, పొన్నం మొగిలి, శెంకెశి కమలాకర్, పిండి కుమారస్వామి, సోలెంకి లింగయ్య, కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


